నిజామాబాద్‌‌ కార్పొరేషన్‌‌ పాలకవర్గాన్ని కూలుస్తం..బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్‌‌ఎస్‌‌ అనైతిక పొత్తు

నిజామాబాద్‌‌ కార్పొరేషన్‌‌ పాలకవర్గాన్ని కూలుస్తం..బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్‌‌ఎస్‌‌ అనైతిక పొత్తు
  • ఐదేండ్లలోనే నగర పాలన చేపడుతాం
  • నిజామాబాద్‌‌ ఎంపీ అర్వింద్‌‌

నిజామాబాద్, వెలుగు : ‘కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్‌‌ఎస్‌‌ అనైతిక పొత్తుతో చేపట్టిన నిజామాబాద్‌‌ కార్పొరేషన్‌‌ పదవులను ఐదేండ్లలో కూలుస్తాం, ఇప్పుడు బాధ్యతలు చేపట్టిన వారి టర్మ్‌‌ ముగియకముందే బీజేపీని గద్దెనెక్కిస్తాం’ అని ఎంపీ అర్వింద్‌‌ అన్నారు. మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ మేయర్‌‌, డిప్యూటీ మేయర్‌‌ ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీని ఓడించేందుకు సీఎం రేవంత్‌‌రెడ్డి నాయకత్వంలో మూడు పార్టీలు, రంగుపూసుకున్న కొందరు పోలీసులు పనిచేశారని ఆరోపించారు.

కాంగ్రెస్‌‌తో జతకట్టిన బీఆర్‌‌ఎస్‌‌ తన అసలు రూపాన్ని చూపిందన్నారు. కాళేశ్వరం, ఈ – కార్‌‌ రేస్‌‌, ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసుల నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని సీఎం రేవంత్‌‌రెడ్డి ఎందుకు కాపాడుతున్నాడో అందరికీ అర్థమైందన్నారు. వారి రక్షణ కోసం సాక్ష్యాలను సైతం తగులబెడ్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌‌ తమ పార్టీ బూట్లు నాకుతుందని ఆరోపించిన మజ్లిస్‌‌ నేత అక్బరుద్దీన్‌‌ ఒవైసీ.. నిజామాబాద్‌‌లో కాంగ్రెస్‌‌ బూట్లు నాకారని ఎద్దేవా చేశారు.

మేయర్, డిప్యూటీ మేయర్‌‌ ఎన్నికలో బీజేపీ అభ్యర్థులు ఓడినప్పటికీ నైతిక విజయం మాత్రం తమదేనన్నారు. అంతకుముందు నిజామాబాద్‌‌ ఏసీపీ ప్రకాశ్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 గంటలు దాటినప్పటికీ కాంగ్రెస్‌‌ కార్పొరేటర్లు మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌కు రాకపోవడంతో మెయిన్‌‌ గేట్‌‌ క్లోజ్‌‌ చేయాలని ఏసీపీ ప్రకాశ్‌‌కు సూచించారు.

ఎలక్షన్‌‌ కమిషన్‌‌ గైడ్‌‌లైన్స్‌‌ ప్రకారం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఎదురుచూడొచ్చని ప్రిసైడింగ్‌‌ ఆఫీసర్‌‌, ఆర్డీవో రాజేంద్రకుమార్‌‌ చెప్పడంతో రాతపూర్వక ఆదేశాలు చూపాలని కోరారు. ఇంతలో ఏసీపీ ప్రకాశ్‌‌ కల్పించుకొని ఏదో చెప్పబోగా ‘నువ్వెందుకు సమాధానం ఇస్తున్నావు, బీఆర్‌‌ఎస్‌‌ కార్పొరేటర్‌‌ను కాంగ్రెస్‌‌ కోసం ఎందుకు ఎత్తుకెళ్లావు’ అని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.